జ్వరంతో ఉన్నప్పటికీ కాన్యులా పెట్టుకుని అసెంబ్లీకి హాజరైన మంత్రి నిమ్మల.. విశ్రాంతి తీసుకోకపోతే సస్పెండ్ చేస్తానంటూ లోకేశ్ సరదా సంభాషణ!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు చేతికి కాన్యులా పెట్టుకుని సభకు హాజరయ్యారు. గోరకల్లు రిజర్వాయర్ రక్షణ గోడ నిర్మాణంపై ఆయన సమాధానం ఇచ్చిన అనంతరం, ఆయన ఆరోగ్యంపై సభ్యులంతా స్పందించారు. మంత్రి విశ్రాంతి తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రి నారా లోకేశ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు సూచించారు. అసెంబ్లీ లాబీలో మంత్రి రామానాయుడితో సరదాగా మాట్లాడిన లోకేశ్, “విశ్రాంతి తీసుకోకపోతే సస్పెండ్ చేయిస్తా” అంటూ చమత్కరించారు. తన యాపిల్ వాచ్ ఇచ్చి నిద్రను ట్రాక్ చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు 15 నిమిషాలు టీవీ చూస్తే రిలాక్స్ అవుతానని, అదే పాటించాలని రామానాయుడుకు సూచించారు.





