- అసెంబ్లీలో గందరగోళం సృష్టించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
- ప్రతిపక్ష హోదా కోసం నినాదాలు – అనంతరం వాకౌట్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సభ ప్రారంభమైన 11 నిమిషాలకే బయటకు వెళ్లిపోయారు. సభ ప్రారంభమైన వెంటనే గవర్నర్ నజీర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారి నినాదాల నడుమ గవర్నర్ ప్రసంగం కొద్దిసేపు మాత్రమే కొనసాగింది. గవర్నర్ ప్రసంగం పూర్తికాకముందే జగన్, వైఎస్సార్సీపీ సభ్యులు “ఇక చాల్లే, పోదాం” అన్నట్లు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మిగతా సభ్యులు ప్రశాంతంగా సభా కార్యకలాపాలను కొనసాగించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి విచ్చేసిన గవర్నర్ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, సభాపతి అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు.





