ఏపీలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంపై ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చేలా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఈ ప్రక్రియను తక్షణమే అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. అర్హులను గుర్తించేందుకు వివిధ విధివిధానాలను త్వరలో ఖరారు చేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
అర్హతలు, ప్రాధాన్యాలు
మార్గదర్శకాలు ప్రకారం, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి, గతంలో కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇళ్ల స్థలాలు పొందని వారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కొత్త భూములు కొనుగోలు చేయకుండా, ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల నుంచే ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే, గతంలో రిజిస్ట్రేషన్‌లకు నోచుకోని 7 లక్షల లబ్ధిదారులతో పాటు మరో లక్షన్నర మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి కూడా ప్రాధాన్యం ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడ్డ తర్వాత 1.14 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఫిబ్రవరి 1న తణుకు మండలం తేతలిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. కేంద్ర పథకం అయిన ప్రధాన్ మంత్రీ ఆవాస్ యోజన కింద రెండో విడతలో ఏపీలో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణ లక్ష్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.






