- విమాన ప్రమాదంలో మృతి చెందిన BJ మెడికల్ కళాశాల విద్యార్థి
- NEETలో కోచింగ్ లేకుండా 700 మార్కులు సాధించిన గ్రామీణ ప్రతిభావంతుడు
జూన్ 12. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్‌లో ఇద్దరు విద్యార్థులు భోజనం చేస్తున్నారు. వారిలో ఒకరు ఆర్యన్ రాజ్‌పుత్.. 20 ఏళ్ల మెడికల్ విద్యార్థి. భోజనం పూర్తయ్యాక, తన స్నేహితుడిని “నువ్వు ముందే వెళ్లు, నేను చేతులు కడుక్కొస్తా” అన్నాడు. ఆ స్నేహితుడు బయటికి వెళ్లిన క్షణాల్లోనే ఎయిరిండియా విమానం హాస్టల్ భవనాన్ని ఢీకొంది. ఆర్యన్ అక్కడికక్కడే భలయ్యాడు!! ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లో ఆ స్నేహితుడే ఆర్యన్ ఫోన్‌తో కుటుంబానికి ఫోన్ చేశాడు. “ఆర్యన్ గాయపడ్డాడు, ఐసీయూలో ఉన్నాడు. వెంటనే రండి” అని చెప్పారు. కుటుంబం మధ్యప్రదేశ్‌లోని జిక్సౌలి గ్రామం నుంచి తక్షణమే అహ్మదాబాద్‌కు బయలుదేరింది. కానీ వారు చేరేసరికి ఆర్యన్ మృతి చెందిన వార్త దృవీకరించారు. FAIMA సభ్యుడు డాక్టర్ ధవల్ ఘమెటి తెలిపిన వివరాల ప్రకారం “ఆర్యన్ రెండో సంవత్సరం MBBS చదువుతున్నాడు. ప్రమాద సమయంలో మెస్‌లో ఉన్నాడు. తీవ్ర గాయాల కారణంగా మృతి చెందాడు.”
ఆర్యన్ మెరిట్ స్టూడెంట్
కోచింగ్ లేకుండానే NEET పరీక్షలో 720లో 700 మార్కులు సాధించాడు. ఇంటర్నెట్ నోట్స్ ఆధారంగా, గ్రామంలో ఉండి చదివిన విజయగాధ అది. తండ్రి రామ్‌హేత్ రాజ్‌పుత్ ఓ రైతు. పెద్ద కుమారుడు సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతుండగా, చిన్న కుమారుడు డాక్టర్ కావాలని ఆయన కల. ప్రతి రోజు రాత్రి 9 గంటలకు ఫోన్ కాల్ మాట్లాడుకుంటారు. ఆర్యన్ తినింది, నేర్చుకున్నది, జరిగిన విజయం.. అన్నీ తండ్రితో పంచుకునేవాడు. వారంతా గర్వపడే ఆర్యన్ ఇప్పుడు లేడు. “మీ అందరినీ సేవ చేస్తాను” అని చెప్పిన ఆ చిన్నోడిని వదిలేయలేక గ్రామమంతా మౌనంగా ఉంది. తల్లి ఇప్పటికీ విషయం తెలియకుండా ఉంది. “ఆమె గుండె భరించదు. శవం వచ్చిన తర్వాతే చెబుతాం” అంటున్నారు గ్రామ సర్పంచ్ పంకజ్ సింగ్ కారార్. ఒక తరం యువతకు మార్గదర్శకంగా మారిన ఆర్యన్… ఒక్క క్షణంలో చరిత్రలో ఓ శోకచిహ్నంగా మిగిలిపోయాడు.





