టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు (AUS vs IND) డ్రాగా ముగిసిన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించిన అశ్విన్‌కి డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్ల నుంచి ఘనమైన వీడ్కోలు లభించింది. ఆసీస్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, నాథన్ లైయన్ కూడా అశ్విన్ వద్దకు వచ్చి అభినందనలు తెలపడం, సంతకాలు చేసిన జెర్సీని బహుకరించడం విశేషం.
తన స్పీచ్‌లో అశ్విన్ భావోద్వేగంగా మాట్లాడుతూ, కెరీర్‌ను ఆస్వాదించిన ప్రస్తావనతో పాటు సహచర ఆటగాళ్లతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. “ఈరోజు చాలా భావోద్వేగభరితమైన క్షణం. భారత క్రికెట్ జెర్సీని ధరించి ఇంతవరకు చేసిన ప్రయాణాన్ని ఆస్వాదించా. ఆటపై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. టీమిండియాకు నా శుభాకాంక్షలు. మీరు మెల్‌బోర్న్‌లో ఎలా ఆడుతున్నారో టీవీలో చూస్తాను. ఏదైనా అవసరమైతే, నేను మీకో ఫోన్ కాల్ దూరంలో ఉంటాను” అని అశ్విన్ తన ప్రసంగాన్ని ముగించాడు.
బీసీసీఐ అశ్విన్ స్పీచ్‌కు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. భారత క్రికెట్‌లో అశ్విన్ అందించిన సేవలకు కృతజ్ఞతలు చెబుతూ అభిమానులు తమ శుభాకాంక్షలు తెలిపారు.





