- టాటా గ్రూప్ గిరిజన సహకార సంస్థ ద్వారా సేంద్రీయ కాఫీ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది.
- కాఫీ పంటను సేంద్రీయ పద్ధతిలో సాగించడం ఇదే మొదటిసారి.
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో సాగించిన కాఫీ పంటను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. 10 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సమగ్ర కాఫీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా, జీసీసీ ఆర్గానిక్ కాఫీ సాగును ప్రోత్సహించింది. 4 ఏళ్ల క్రితం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల పరిధిలో 2,600 ఎకరాల కాఫీ తోటల్లో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ (ఎన్‌పీఓపీ)కు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతిలో సాగు చేపట్టింది. ఈ ఏడాదికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ సాధించగలిగింది.
టాటా గ్రూప్ ఇప్పటికే కాఫీ వ్యాపారంలో ఉంది. ఈ సంస్థ త్వరలో ఆర్గానిక్ కాఫీని మార్కెట్‌లోకి తేవాలని చూస్తోంది. తొలి విడతగా 10 వేల కిలోల కాఫీ గింజల కొనుగోలుకు జీసీసీతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుత సీజన్లో గిరిజన రైతులు పండించిన కాఫీకి మంచి ధరలు లభిస్తున్నాయి. సాధారణ పార్చిమెంటు కాఫీ కేజీకి రూ.400 ధర లభిస్తే, ఆర్గానిక్ పార్చిమెంట్‌కు రూ.450 చొప్పున చెల్లిస్తున్నారు. జీసీసీ ద్వారా సేంద్రీయ పద్ధతుల్లో సాగించిన కాఫీ రైతులకు అధిక ధరలు అందించడంతో పాటు, వారి ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడుతుంది.






