ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన ‘పూరి మ్యూజింగ్స్’ లో ఆరోగ్యం, జీవనశైలిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆటోఫజీ అనే శరీర ప్రక్రియ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉపవాసం, వ్యాయామం, చన్నీటి స్నానం వంటి ఆరోగ్య అలవాట్ల వల్ల ఆటోఫజీ యాక్టివేట్ అవుతుందని, శరీరం తనని తాను రిపేర్ చేసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుందని వివరించారు.
ఆటోఫజీ అంటే ఏమిటి?
ఆటోఫజీ (Autophagy) అనేది గ్రీకు పదం, దీనర్థం ‘తాను తానే తినడం’ అని. ఇది శరీరంలో సహజంగా జరిగే సెల్యులర్ రీసైక్లింగ్ ప్రక్రియ. దెబ్బతిన్న, పనికిరాని కణాలను శరీరమే తొలగించడంతో పాటు ప్రోటీన్లను రీపేర్ చేస్తుందని పూరి తెలిపారు. ఈ ప్రక్రియ వల్ల మెటబాలిజం మెరుగుపడి, వృద్ధాప్య లక్షణాలు తగ్గి, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుందన్నారు.
ఆటోఫజీ ఎలా యాక్టివేట్ అవుతుంది?
- ఉపవాసం: శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ద్వారా ఆటోఫజీ ప్రక్రియ యాక్టివేట్ అవుతుంది.
- వ్యాయామం: శరీరం శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుంది.
- చన్నీటి స్నానం: శరీర పునరుత్తేజానికి దోహదం చేస్తుంది.
- హీట్ అండ్ కోల్డ్ థెరపీ: ఈ విధానం శరీరంలోని కణాల రిపేర్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
పూరి మాట్లాడుతూ, జపాన్‌కు చెందిన యష్నోరి ఓసుమి ఆటోఫజీ మీద చేసిన పరిశోధనలకు నోబెల్ ప్రైజ్ దక్కిందని గుర్తు చేశారు. ఉపవాసం, వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు ఆరోగ్యంగా ఉండేందుకు కీలకమని ఆయన తెలిపారు.






