- ప్రియుడితో కలిసి కుమారుడినే కిడ్నాప్ చేయించిన అమానుష తల్లి
- బిహార్‌లో షాకింగ్ ఘటన – తల్లితో పాటు ప్రియుడు అరెస్టు
బిహార్ రాష్ట్రంలో మానవత్వాన్ని కలవరపెట్టే ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి ఉండేందుకు, సొంత ఇల్లు నిర్మించేందుకు ఓ తల్లి మాతృత్వాన్ని తాకట్టుపెట్టింది. తన కన్నబిడ్డను కిడ్నాప్ చేయించి, 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. చివరికి ఆమె కుట్ర పోలీసుల కళ్లుగప్పలేకపోయింది. ఛప్రా జిల్లాకు చెందిన 13 ఏళ్ల ఆదిత్య కుమార్ ఇటీవల అపహరణకు గురయ్యాడు. కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా, 25 లక్షలు ఇవ్వకపోతే ఆదిత్యను హతమర్చుతామని కిడ్నాపర్లు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో బాలుడి తల్లి బబితా దేవి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో, పోలీసులు ఆమెను విచారించారు. పోలీసుల ఎదుట కిడ్నాప్ ప్లాన్ తానే రూపొందించానని బబితా దేవి అంగీకరించడంతో అధికారులు షాక్‌కు గురయ్యారు. తన ప్రియుడు నితీశ్ కుమార్‌తో కలిసి ఇల్లు కట్టుకోవాలని, అందుకు కావాల్సిన డబ్బు కోసం తానే కుమారుడిని కిడ్నాప్ చేయించానని ఆమె చెప్పింది. బబిత ఇచ్చిన సమాచారంతో పోలీసులు నితీశ్ కుమార్‌ను అరెస్టు చేసి, పట్నాలో గల ఓ ప్రదేశంలో బంధించిన ఆదిత్య కుమార్‌ను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. తల్లితో పాటు నితీశ్ కుమార్‌పై కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.





