ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకలతో మల్టీ స్పెషాలిటీ లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ ఆసుపత్రులు నెలకొంటాయని సోమవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు.
- 105 నియోజకవర్గాల్లో కొత్త ఆసుపత్రులు: ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయని, మిగిలిన 105 ప్రాంతాల్లో ప్రాధాన్యత క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.
- రాయితీలతో ప్రోత్సాహం: వెనుకబడిన ప్రాంతాల్లో ఆసుపత్రులకు స్థలం, ఆర్థిక రాయితీలు అందజేస్తామని, ఎన్టీఆర్ వైద్య సేవల కింద 50 శాతం రోగులను పంపుతామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 80 శాతం మంది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు వంటి 10 ప్రధాన వ్యాధులతో బాధపడుతున్నారని చంద్రబాబు వివరించారు. ఈ వ్యాధులను నివారించేందుకు మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు, వ్యాయామం అవసరమని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ఆరోగ్యకర జీవన విధానాలను నేర్పిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో వైద్య సలహాలు, రియల్‌టైమ్ పర్యవేక్షణతో పాటు ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని ఆయన చెప్పారు.
అమరావతిలో గ్లోబల్ మెడిసిటీ.. డిజిటల్ హెల్త్ సెంటర్లు
రాజధాని అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టును నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. 200 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుందని, ఖతార్‌తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో జూన్ 15 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఈ కేంద్రం ప్రారంభమవుతుందని, 26 నెలల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద ప్రజలందరికీ హెల్త్ కార్డులు జారీ చేసి, వాటిని డిజిటల్ లాకర్‌లో భద్రపరుస్తామని వివరించారు. ప్రతి వ్యాధికి నిపుణులైన సలహాదారులను నియమిస్తామని, క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రత్యేక కమిటీలు వ్యూహాలు రూపొందిస్తాయని ఆయన తెలిపారు.





