- నారా దేవాంశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి సేవ
- తరిగొండ వెంగమాంబ సత్రంలో భక్తులకు అన్నదానం – స్వయంగా చంద్రబాబు, కుటుంబ సభ్యులు వడ్డింపు
- ఆలయ పవిత్రతపై కఠిన నిర్ణయాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తరిగొండ వెంగమాంబ సత్రంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్వయంగా భోజనం వడ్డిస్తూ భక్తులకు సేవ చేయడం తృప్తిని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.
తిరుమల పవిత్రతకు కట్టుబడి ఉన్నాం – సీఎం స్పష్టీకరణ
తర్వాత తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, తిరుమల పవిత్రత రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆధ్యాత్మికతను దెబ్బతీసే ఏదైనా కార్యకలాపాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ‘‘ఏడు కొండలు వేంకటేశ్వరస్వామివే. ఇక్కడ ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకూడదు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి విభాగాన్ని పునఃసమీక్షిస్తాం. గతంలో మంజూరైన ముంతాజ్ హోటల్ అనుమతులను రద్దు చేస్తున్నాం. తిరుమల పరిసరాల్లో కమర్షియలైజేషన్ అనుమతించేది లేదు. ప్రతి భక్తుడి విశ్వాసాన్ని కాపాడడమే మా కర్తవ్యంగా భావిస్తున్నాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా వేంకటేశ్వర ఆలయాలు
తితిదే పాలకమండలి సమక్షంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ‘‘దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మిస్తాం. హిందూ ఆధ్యాత్మికతను పటిష్ఠంగా కొనసాగించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకం’’ అని పేర్కొన్నారు.





