- కృత్రిమ మేధ (AI) ఆధారంగా విద్యుత్ డిమాండ్ అంచనాలను రూపొందించాలని సూచన.
- విద్యుత్ అంతరాయాలు తగ్గించేందుకు సబ్‌స్టేషన్, ఫీడర్ స్థాయిలో ఎనర్జీ ఆడిట్ కీలకం.
విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ నివేదికల ఆధారంగా కృత్రిమ మేధ (AI) సాయంతో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసే విధానం రూపొందించాలన్నారు. భూగర్భ జలాల డేటా, భూమిలో తేమశాతం వంటి అంశాలను కూడా ఏఐతో అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజల నుంచి విద్యుత్ సేవలపై అభిప్రాయాలు సేకరించే విధానంలోనే సిబ్బంది పనితీరుపై సర్వే చేయాలని, తరచూ విద్యుత్ అంతరాయాలు సంభవించే ప్రాంతాల్లో కారణాలను గుర్తించి పరిష్కార మార్గాలు అన్వేషించాలని స్పష్టం చేశారు.
థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు – దీర్ఘకాలిక ప్రణాళిక
జెన్‌కో, కోల్ ఇండియా భాగస్వామ్యంతో ఒడిశాలోని తాల్చేరులో థర్మల్ ప్లాంటు ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో బొగ్గు రవాణా వ్యయం రావడంతో పిట్‌హెడ్ థర్మల్ ప్లాంట్లను ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటును పరిశీలించి, పీఎస్పీలు, బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంగళవారం రాష్ట్రంలో 12,260 మెగావాట్ల గ్రిడ్ పీక్ డిమాండ్ నమోదుకావడం విశేషం.





