
బిగ్‌బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ నిలిచారు. గట్టిపోటీ ఇచ్చిన గౌతమ్‌ను వెనక్కి నెట్టి, రూ.54 లక్షల భారీ ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మారుతీ కారును అందుకున్నారు. 105 రోజుల పాటు హౌస్‌లో నిలబడి, 21 మంది కంటెస్టెంట్లను ఓడించి టైటిల్ విన్నర్‌గా నిలిచిన నిఖిల్ క్రమశిక్షణ, మేటి గేమ్‌తో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు.
డ్యాన్స్ అంటే ప్రాణం:
కర్ణాటకలోని మైసూర్ నగరానికి చెందిన నిఖిల్ మాలియక్కల్ నటనకు ఎంతగానో ఆసక్తి కలిగిన వ్యక్తి. తల్లి సులేఖ కన్నడ నటి కాగా, తండ్రి శశి జర్నలిస్ట్. చిన్నతనంలోనే స్కూల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేకించి డ్యాన్స్ పోటీలలో ప్రతిభను చాటారు. బెంగళూరులో ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత, డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు.
తెలుగు ప్రేక్షకులకు ‘గోరింటాకు’ ద్వారా పరిచయం:
కన్నడలో పలు చిత్రాలతో నటుడిగా తన ప్రయాణం ప్రారంభించిన నిఖిల్ తెలుగులో ‘గోరింటాకు’, ‘అమ్మకు తెలియని కోయిలమ్మ’ వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. అందులో పార్థు పాత్రలో ఆయన నటన బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
బిగ్‌బాస్‌లో స్మార్ట్ గేమ్:
బిగ్‌బాస్ హౌస్‌లో నిఖిల్ మొదట్లో పెద్దగా అంచనాలు లేకపోయినా, ఫిజికల్ టాస్క్‌లలో చూపిన పట్టుదల, నామినేషన్స్‌లో తన పాయింట్స్‌ను కచ్చితంగా చెప్పడం ద్వారా ఆయన ఒక్కో అడుగుగా ప్రేక్షకుల మద్దతును సంపాదించారు. పృథ్వీతో కలిసి టాస్క్‌లు ఆడుతూ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇంట్లో ఇతర కంటెస్టెంట్ల ఆరోపణలకు సున్నితంగా సమాధానం చెప్పి, ఎక్కడా సహనం కోల్పోకుండా స్మార్ట్ గేమ్‌ను ఆడుతూ ముందుకు సాగారు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో కొత్త ఎత్తుగడలు తీసుకుంటూ, గ్రూప్‌లను సమన్వయం చేయడంలో కూడా నిఖిల్ సత్తా చాటారు. ఫిజికల్ టాస్క్‌లలో గాయాలు పట్టించుకోకుండా కష్టపడటం, మిగతా సభ్యులను ఒక తాటిపైకి తీసుకురావడం వంటి లక్షణాలు ఆయన విజయం వైపు నడిపాయి.
భారీ ప్రైజ్ మనీ:
బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లలో ఇప్పటివరకు ఎవరికీ అందని భారీ ప్రైజ్ మనీ రూ.54 లక్షలు అందుకోవడం నిఖిల్ ప్రత్యేకతగా నిలిచింది. అందుకు తోడు ట్రోఫీ, మారుతీ కారును కూడా సొంతం చేసుకుని ఆయన మరో మైలురాయిని చేరుకున్నారు.






