- తేనె కొండపై ఐదు చెక్క కాటేజీలు, టెంట్ బసకు మంచి స్పందన
- స్పీడ్‌బోట్లు, వృద్ధుల కోసం వాహనం, మరిన్ని టెంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు
ఎత్తయిన కొండలు, వాటి మధ్య పరవళ్లు తొక్కే గోదావరి, పక్షుల కిలకిలరావాలు, ప్రశాంతమైన వాతావరణం.. ఇవన్నీ పర్యాటకులను ఆకర్షించే ప్రత్యేకతలు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గడిపేందుకు మొగ్గుచూపే వారికి పోలవరం మండలం కొరుటూరు సమీపంలోని తేనె కొండ అత్యుత్తమ ఎంపికగా మారుతోంది. ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఇక్కడ కేరళ తరహాలో ఐదు చెక్క కాటేజీలు నిర్మించి, బస కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ కాటేజీల్లో బస చేసేందుకు రోజుకు రూ.8500 చెల్లించాలి. ఇక టెంట్లలో బస చేయాలనుకుంటే రూ.1800 చెల్లిస్తే సరిపోతుంది. దీంతో చాలా మంది పర్యాటకులు ఇక్కడ బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల సూచనల మేరకు రూ.1.29 కోట్లతో తేనె కొండ ఎకో టూరిజం అభివృద్ధి చేయనున్నారు. ఇందులో మరిన్ని స్పీడ్‌బోట్లు, వృద్ధులు, మహిళల రవాణా కోసం ప్రత్యేక వాహనం, జనరేటర్ ఏర్పాటు ప్రతిపాదనలు పంపినట్లు అటవీశాఖ అధికారి ఎస్కే వలీ తెలిపారు. ప్రస్తుతం తేనె కొండపై 20 టెంట్లు మాత్రమే ఉన్నాయి. మరిన్ని 20 టెంట్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతకుముందు ప్రైవేట్ వ్యక్తులు గోదావరి ఒడ్డున తాత్కాలిక ఏర్పాట్లు చేసి అధిక రుసుము వసూలు చేసేవారు. కానీ పోలవరం ప్రాజెక్టు కారణంగా అవి మూతపడటంతో, ఇప్పుడు అధికారికంగా కాటేజీలు, టెంట్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.





