- శివరాత్రి కోసం పాదయాత్ర చేస్తుండగా భక్తులపై ఏనుగుల దాడి
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా వై.కోట నుంచి పాదయాత్రగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడు ప్రాణాలు కోల్పోయారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఏనుగుల దాడిలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ, ఇది బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు ప్రకటించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ను వై.కోటకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలంటూ ఆదేశించారు. అటవీశాఖ నుంచి సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలన్నారు.





