క్రీస్తును శిలువ వేసిన రోజు శుక్రవారం, అయితే ఆ శిలువ ద్వారా మానవాళికి ప్రేమ, క్షమాగుణం, సహనం వంటి సందేశాలు అందిన రోజుగా ఇది ‘గుడ్ ఫ్రైడే’గా పిలువబడుతుంది. క్రైస్తవ సమాజంలో క్రిస్మస్, ఈస్టర్‌లతో పాటు గుడ్ ఫ్రైడేకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు క్రీస్తు మరణంలో మానవీయత, సాటి మనిషి పట్ల ప్రేమ, సేవాభావం వంటి గుణాలు ప్రతిధ్వనిస్తాయి. క్రైస్తవులు తెల్ల వస్త్రాలు ధరించి చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ, తమ పాపాలపై పశ్చాత్తాపంతో కొత్త జీవన విధానాన్ని స్వీకరిస్తారు.
“క్రీస్తు మరణం విషాద భరితమైనా, అది మానవుణ్ణి ప్రతి క్షణం మేల్కొల్పే ఆత్మ ప్రక్షాళన!!” అని క్రైస్తవ సమాజం భావిస్తుంది.
అద్భుతాలు చేసే శక్తి ఉన్నప్పటికీ, క్రీస్తు తండ్రి దేవుని మాటకు విధేయత చూపి శిలువపై మరణాన్ని స్వీకరించాడు. ఈ ప్రాణత్యాగం మానవుణ్ణి తప్పిదాల నుంచి హెచ్చరిస్తూ, ప్రేమాభిమానాలతో జీవించమని సందేశమిస్తుంది. గుడ్ ఫ్రైడే ద్వారా క్రీస్తు తత్త్వం పరిపూర్ణత్వం సాధిస్తుంది, ఇది జననం, మరణం, పునరుత్థానంలో మానవీయతను ఆవిష్కరిస్తుంది. ఈ రోజు క్రైస్తవులు దుఃఖ పరివేదనతో ఉన్నప్పటికీ, క్రీస్తు పవిత్రతను చాటే శుభకర శుక్రవారంగా దీన్ని జరుపుకుంటారు.





