- గూగుల్ తన స్మార్ట్ హోమ్ ఎకోసిస్టమ్ కోసం ‘జెమిని ఫర్ హోమ్’ను తీసుకొచ్చింది.
- ఇది గూగుల్ అసిస్టెంట్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.
- అక్టోబర్‌లో ఈ ఫీచర్‌ను ప్రారంభించనుంది.
స్మార్ట్‌ఫోన్లలో, ఇతర డివైజ్‌లలో మనం ఏదైనా పని చేయాలంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు ‘గూగుల్ అసిస్టెంట్’. కానీ, ఇకపై ఆ పేరు ఉండదు. దాని స్థానాన్ని ‘జెమిని ఫర్ హోమ్’ అనే సరికొత్త ఏఐ అసిస్టెంట్ భర్తీ చేయనుంది. గూగుల్ తమ నెస్ట్ స్మార్ట్ స్పీకర్లు, డిస్‌ప్లేలలో ఈ అప్‌గ్రేడ్‌ను విడుదల చేయనుంది. ఇది స్మార్ట్ హోమ్ టెక్నాలజీలో ఒక కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు.
స్మార్ట్ హోమ్‌కు కొత్త రూపు..
గత ఆరేళ్లలో గూగుల్ హోమ్‌లో జరిగిన అతిపెద్ద అప్‌గ్రేడ్ ఇదే అని నిపుణులు చెబుతున్నారు. గూగుల్ హోమ్, నెస్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ అనీష్ కట్టుకరణ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. జెమిని ఫర్ హోమ్ వాడకం అద్భుతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది గూగుల్ ఏఐ మోడల్స్‌లోని అధునాతన సామర్థ్యాలను ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా, ఇది సహజమైన సంభాషణలకు అనుగుణంగా మారుతుంది.
కాంప్లెక్స్ ఆదేశాలకు కూడా ఓకే..
జెమిని ఫర్ హోమ్ మీ మాటల్లోని ఉద్దేశాన్ని, సందర్భాన్ని బాగా అర్థం చేసుకోగలదు. ఉదాహరణకు, “నా బెడ్రూం తప్ప మిగతా గదుల్లో లైట్లు ఆఫ్ చేయి” లేదా “బ్రోకలీ ఉడకబెట్టడానికి టైమర్ పెట్టు” వంటి క్లిష్టమైన ఆదేశాలకు కూడా ఇది కచ్చితంగా స్పందిస్తుంది. అలాగే, లిస్టులు తయారు చేయడం, క్యాలెండర్‌లో ఈవెంట్లు, రిమైండర్లు సెట్ చేయడం లాంటి పనులను మరింత సులభతరం చేస్తుంది. ‘హేయ్ గూగుల్’ అని పదేపదే చెప్పాల్సిన అవసరం లేకుండా, నేరుగా సంభాషణ సాగించేందుకు ఇందులో జెమిని లైవ్ అనే ఫీచర్‌ను కూడా పొందుపరిచారు.
అమెజాన్‌కు పోటీ..
అమెజాన్ ఇప్పటికే జనరేటివ్ ఏఐ ఆధారిత అలెక్సా ప్లస్ అసిస్టెంట్‌ను లక్షల ఇళ్లలోకి తీసుకువచ్చింది. దానికి పోటీగా గూగుల్ ఈ జెమిని ఫర్ హోమ్‌ను తీసుకొచ్చింది. జెమిని ఫర్ హోమ్ ఉచిత, అలాగే పెయిడ్ ప్లాన్‌లలో అందుబాటులోకి రానుంది. దీనిని అక్టోబర్‌లో ఒక ఎర్లీ యాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా దశలవారీగా విడుదల చేయనున్నారు. అయితే, కొత్త హార్డ్‌వేర్‌ను కూడా దీనితో పాటు విడుదల చేసే అవకాశం ఉంది.





