- గూగుల్ పిక్సెల్ 10 సిరీస్‌లో ‘వాయిస్ ట్రాన్స్‌లేట్’ అనే కొత్త ఫీచర్.
- ఇది మీరు మాట్లాడే మాటలను వేరే భాషలోకి అప్పటికప్పుడు మారుస్తుంది.
- ‘టేక్ ఎ మెసేజ్’ అనే మరో ఫీచర్‌తో మిస్డ్ కాల్స్ వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు.
ఫోన్ మాట్లాడాలంటే భాష అడ్డంకిగా ఉంటుందని బాధపడే రోజులు పోయాయి. టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో సరికొత్త ‘వాయిస్ ట్రాన్స్‌లేట్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో పనిచేస్తుంది. దీని ద్వారా, ఒకరితో ఫోన్‌లో మాట్లాడాలంటే భాష తెలియకపోయినా.. సులభంగా మాట్లాడొచ్చు.
ఎలా పని చేస్తుంది?
ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే, మీరు మాట్లాడే మాటలు అవతలి వ్యక్తి భాషలోకి అప్పటికప్పుడు మారుతాయి. అంతేకాదు, మీ గొంతును అనుకరించి, ఆ భాషలో మాట్లాడుతుంది. ఇది మొత్తం ప్రక్రియను మీ ఫోన్‌లోనే చేస్తుంది. గూగుల్ తాజా జెమిని నానో టెక్నాలజీని, టెన్సర్ జీ5 చిప్‌సెట్‌ను ఇందులో ఉపయోగిస్తోంది. ముఖ్యంగా, ఈ ప్రాసెస్‌లో మీ ఆడియో డేటా ఎక్కడా స్టోర్ అవదు. ఇది మీ గోప్యతకు పూర్తి భద్రత ఇస్తుంది.
వాడటం చాలా సులువు..
ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే, కాల్ మాట్లాడుతూ ‘కాల్ అసిస్ట్’ మెనూలోకి వెళ్లాలి. అక్కడ ‘వాయిస్ ట్రాన్స్‌లేట్’ ఆప్షన్‌ను ఎంచుకుని, మీకు కావాల్సిన భాషను సెట్ చేసుకోవాలి. ఇది ఇంగ్లిష్ నుంచి ఫ్రెంచ్, జర్మన్, హిందీ, జపనీస్ వంటి పలు భాషల్లోకి అనువాదం చేస్తుంది.
‘టేక్ ఎ మెసేజ్’తో మరిన్ని లాభాలు..
ఈ ఫీచర్‌తో పాటు, గూగుల్ మరో ఉపయోగకరమైన ఫీచర్‌ను కూడా జోడించింది. అదే ‘టేక్ ఎ మెసేజ్’. మీరు ఏదైనా కాల్‌ను మిస్ చేసినా, లేదా తీసుకోకపోయినా, ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఆ కాల్‌ను లిఫ్ట్ చేసి, లైవ్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ చేస్తుంది. అంటే, ఎవరు కాల్ చేశారు, ఎందుకు చేశారు? అనే విషయం మీకు వెంటనే తెలిసిపోతుంది.





