- గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన పిక్సెల్ 10 సిరీస్‌లో ఏఐ ఆధారిత ఫీచర్లు.
- మీ రోజువారీ పనులను సులభతరం చేసే ‘ఏఐ డైలీ హబ్’, ‘మ్యాజిక్ క్యూ’ ఫీచర్లు.
- శక్తివంతమైన టెన్సార్ జీ5 చిప్, గెమినీ నానో ఏఐ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్లలో విప్లవం.
స్మార్ట్‌ఫోన్ల తయారీలో సరికొత్త ఆవిష్కరణలకు చిరునామా అయిన గూగుల్.. పిక్సెల్ 10 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 10, 10 ప్రో, 10 ప్రో ఎక్స్ఎల్, అలాగే మడతపెట్టే 10 ప్రో ఫోల్డ్ మోడళ్లు ఉన్నాయి. ఈ కొత్త ఫోన్లలో గూగుల్ కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లను జోడించి వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని అందించనుంది.
‘ఏఐ డైలీ హబ్’తో పనులకు అడ్డు లేదు
గూగుల్ ఈ ఫోన్లలో పరిచయం చేసిన కొత్త ఫీచర్ ‘ఏఐ డైలీ హబ్’. ఇది ఒక ఏఐ ఆధారిత పర్సనల్ అసిస్టెంట్. మీ ఫోన్ హోమ్ స్క్రీన్‌పైనే.. మీ రోజువారీ పనులు, క్యాలెండర్ ఈవెంట్లు, వాతావరణం లాంటి సమాచారాన్ని ఒకే దగ్గర చూపిస్తుంది. ఉదయం లేవగానే ఈ హబ్ మీకు రోజులో చేయాల్సిన పనుల గురించి వివరంగా చెబుతుంది. దాంతో మీ రోజు ప్రణాళికతో ప్రారంభమవుతుంది. దీంతోపాటు, మీరు ఎక్కువగా చూడడానికి ఇష్టపడే యూట్యూబ్ వీడియోలు, ప్లేలిస్టులను కూడా ఇది సూచిస్తుంది.
మ్యాజిక్ క్యూ.. అద్భుతమైన ఫీచర్!
ఇంకో ప్రత్యేకమైన ఫీచర్ మ్యాజిక్ క్యూ. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది జీమెయిల్, క్యాలెండర్ లాంటి అప్లికేషన్లను గమనించి, మీ అవసరాలకు తగ్గట్టుగా వ్యక్తిగత సలహాలను ఇస్తుంది. ఉదాహరణకు, మీరు ఎవరికైనా మెయిల్ పంపాలనుకుంటే, అందులో ఏమేం రాయాలి? లాంటి సూచనలు ఇస్తుంది. ఈ ఫీచర్లతో మీ స్మార్ట్‌ఫోన్ కేవలం ఒక సాధనం మాత్రమే కాదు, మీ దైనందిన జీవితంలో తోడుగా ఉండే ఒక ‘ఏఐ కోచ్’ లా పనిచేస్తుంది.
కొత్త టెన్సార్ చిప్
పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల లోపల శక్తివంతమైన టెన్సార్ జీ5 చిప్ను వాడారు. ఇందులో ఆన్-డివైజ్ ఏఐ ఫీచర్లను ఉపయోగించేందుకు గెమినీ నానో టెక్నాలజీ ఉంది. ఈ చిప్ తో ఫోన్ పనులు వేగంగా జరగడమే కాకుండా, శక్తి వినియోగం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా, మీ వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండడానికి టైటన్ ఎమ్2 సెక్యూరిటీ చిప్‌లను అమర్చారు. ఈ ఫోన్లలో కొత్తగా పిక్సెల్ స్నాప్ మ్యాగ్నటిక్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది.




