హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పాలన తొలగించి, చిన్న గుడి నుంచి తిరుమల వెంకన్న ఆలయం వరకు అన్నింటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్తు ఆధ్వర్యంలో జరిగిన ‘హైందవ శంఖారావం’ సభలో స్వామీజీలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ఈ అంశంపై మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్క హిందువు కంకణబద్ధులు కావాలని, ఆలయాల నిర్వహణ హిందువులకే అప్పగించాలనే నినాదం జోరుగా వినిపించింది.
‘మన ఆలయాల నిర్వహణ మన చేతుల్లో ఉండాలి’
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి మాట్లాడుతూ, “ఏపీలో ఒకప్పుడు 15 లక్షల ఎకరాల ఆలయ ఆస్తులు ఉండగా, ఇప్పుడు కేవలం నాలుగున్నర లక్షల ఎకరాలే మిగిలాయి. ఆలయాల్లో పూజలు ఏ విధంగా చేయాలో అధికారులే నిర్ణయిస్తారా? చిన్న ఆలయాల నుంచి తిరుమల వరకు సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించకపోవడం దురదృష్టకరం. వీఐపీ దర్శనాల పేరుతో సామాన్య భక్తులను హేళన చేయడం హైందవ ధర్మానికి ముప్పు. ఇలాంటి పరిస్థితుల్లో మనవాళ్లు ఇతర మతాల్లోకి మళ్లకుండా ఉండటం ఎలా సాధ్యం?” అని ప్రశ్నించారు.





