విద్యార్థుల్లో మార్పు కోసం ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన ప్రయత్నం అందరినీ కదిలిస్తోంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం చింతా రమణ, పిల్లలు చదువుల్లో వెనుకబడటం, పాఠశాలకు సక్రమంగా రాకపోవడంతో ఆవేదన చెందారు. పిల్లలను దారిలో పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో, చివరకు ఆయనే గుంజీలు తీసి నిరసన తెలిపారు.
మీరు క్రమశిక్షణ తప్పితే మిమ్మల్ని శిక్షించబోం. మాకు మేమే శిక్ష అనుభవిస్తాం అంటూ విద్యార్థుల ఎదుటే గుంజీలు తీశారు. విద్యార్థులు వద్దు సార్.. వద్దు సార్ అంటూ వారించినా, ఆయన గుంజీలు తీస్తూనే ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన స్పందించారు. పిల్లలకు మంచి విద్య అందించడం తమ బాధ్యత అని, కానీ పిల్లలు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం తనను బాధించిందని చెప్పారు. అందుకే, పిల్లల్లో మార్పు తీసుకురావడానికి ఇలా చేశానన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. అందరం కలిసి పనిచేసి, విద్యార్థులకు మంచి ప్రోత్సాహం అందిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.





