చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ (HMPV) దేశంలోనూ తన ఉనికిని చాటుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదటి కేసు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడ్డ శిశువు చికిత్స పొందుతుండగానే, మరో రెండు కేసులు నమోదవడం సంచలనంగా మారింది.
ఈ హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదు. మెటాప్న్యూమోవైరస్ సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. శీతాకాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు లాంటిదే ఇది. అయితే, కొన్ని సందర్భాల్లో ఆస్తమా, న్యుమోనియా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం దీనికి టీకా అందుబాటులో లేదు. మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. అంతేకాకుండా, అనారోగ్యంతో ఉన్న వారిని దగ్గరికి రాకుండా చూసుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా దగ్గు, తుమ్ముల ద్వారా, కలుషిత ఉపరితలాల ద్వారా జరుగుతుంది.
భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను ఆందోళన చెందవద్దని కోరుతోంది. సరైన జాగ్రత్తలతో వైరస్‌ను నియంత్రించవచ్చని నిపుణులు తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలని కోరారు. ప్రజలంతా మాస్క్ ధరిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.






