- ఖతార్‌లోని అల్ ఉదెయ్ద్ వైమానిక స్థావరంపై ఇరాన్ సైనిక దాడి చేయడంతో 8 లక్షల మందికి పైగా ఉన్న భారతీయులు ఆందోళన చెందారు.
- పరిస్థితిని గమనించి అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని దోహాలోని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఇరాన్ సోమవారం రాత్రి ఖతార్‌లోని ఒక అమెరికా స్థావరంపై సైనిక దాడి చేయడంతో, అక్కడ నివసిస్తున్న 8 లక్షల మందికి పైగా భారతీయుల భద్రతపై ఢిల్లీలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దోహాలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటనపై స్పందిస్తూ, అక్కడి భారతీలంతా అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని సూచించింది. భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది: “ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఖతార్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని కోరడమైనది. దయచేసి ప్రశాంతంగా ఉండండి మరియు స్థానిక వార్తలు, ఖతార్ అధికారుల సూచనలు మరియు మార్గదర్శకాలను పాటించండి. రాయబార కార్యాలయం తమ సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది.”
దాడి వివరాలిలా..
ఇరాన్ సాయుధ దళాల ప్రకటన ప్రకారం, ఖతార్‌లోని అల్ ఉదెయ్ద్ వైమానిక స్థావరంపై సైనిక దాడిని తాము చేశామని తెలిపింది. ఇది ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరం. అల్ ఉదెయ్ద్ వైమానిక స్థావరం ఖతార్ రాజధాని దోహాకు నైరుతి దిశలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. సుమారు 10,000 మంది అమెరికా సైనికులకు ఆశ్రయం ఇస్తుంది. ఈ స్థావరం పశ్చిమాసియా సైనిక కార్యకలాపాలకు కీలకమైన కేంద్రంగా ఉంది. ఇక్కడి సుదీర్ఘమైన రన్‌వేలు, అధునాతన హ్యాంగర్‌లు, కమాండ్ అండ్ కంట్రోల్ మౌలిక సదుపాయాలు , లాజిస్టిక్స్ వ్యవస్థలు దీనిని ఈ ప్రాంతంలో ఒక వ్యూహాత్మక కేంద్రంగా మార్చాయి.
భారత్-ఖతార్ సంబంధాలు
భారత్, ఖతార్‌తో బలమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలను కలిగి ఉంది. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు మార్లు ఖతార్ ని సందర్శించారు. ఖతార్‌లోని 8.3 లక్షలకు పైగా ఉన్న భారతీయ సమాజం ఆ దేశంలో అతిపెద్ద ప్రవాసీయుల సమూహం. వీరు వైద్యం, ఇంజనీరింగ్, విద్య, ఫైనాన్స్, బ్యాంకింగ్, వ్యాపారం, మీడియా వంటి అనేక రంగాలతో పాటు, భారీ సంఖ్యలో సాధారణ కార్మికులుగా కూడా పనిచేస్తున్నారు. ఖతార్‌లో 20,000 కంటే ఎక్కువ చిన్న, పెద్ద భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. అవి పూర్తిగా భారతీయ యాజమాన్యంలో ఉన్నవి.. అలాగే, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనర్జీ వంటి రంగాల్లో సంయుక్త సంస్థలుగా ఉన్నాయి. ఇన్వెస్ట్ ఖతార్ ప్రకారం.. భారతీయ కంపెనీలు 2017-2025 మధ్య కాలంలో ఖతార్‌లో 350 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ఎల్‌అండ్‌టీ (L&T), షాపూర్జీ పల్లోంజి (Shapoorji Pallonji), విప్రో (Wipro), టీసీఎస్ (TCS), టెక్ మహీంద్రా (Tech Mahindra), లులు గ్రూప్ (Lulu Group), మలబార్ (Malabar), మరియు తనిష్క్ (Tanishq) వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు ఖతార్‌లో దశాబ్దాలుగా పనిచేస్తున్నాయి.
ప్రస్తుతం, ఖతార్‌లోని 19 భారతీయ పాఠశాలలతో పాటు అంతర్జాతీయ పాఠశాలల్లో 60,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. భారతీయ పాఠశాలల్లోనే సుమారు 4,500 మంది అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉన్న భారతీయుల భద్రతను ఢిల్లీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.





