లోకేశ్ రాజకీయ ప్రవేశంపై చంద్రబాబు వివరణ
వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం వంటి ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. లోకేశ్ రాజకీయ వారసత్వం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ‘‘చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తాయి. ఎవరైనా వాటిని సద్వినియోగం చేసుకుంటేనే రాణించగలరు. వ్యాపారం చేస్తే లోకేశ్‌కు అది తేలికైన పని. కానీ, ఆయన ప్రజల సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇక్కడ వారసత్వమనే విషయం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
విపక్ష అవినీతి విచారణ
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. ‘‘రాజకీయ కక్షసాధింపు ఉండదు. ఎవరు తప్పు చేసినా, చట్టపరంగానే వ్యవహరిస్తాం’’ అన్నారు. జగన్‌పై గతంలోనూ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. ‘‘గుజరాత్‌లో ఐదుసార్లు వరుసగా భాజపా గెలిచి సుస్థిర పాలన అందించింది. అదే తీరులో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. నాలుగోసారి కూడా ప్రధాని అవుతారనే నమ్మకం ఉంది. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. పరిశ్రమల కోసం పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో మేం విజయం సాధిస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయాల్లోనూ విలువలు ఎంతో ముఖ్యం. మన దేశం ప్రపంచంలో అంతర్జాతీయ గుర్తింపు పొందడం మన విలువల కారణమే. వనరులను దోచుకుని సంపాదించడం అభివృద్ధికి విఘాతం’’ అని చంద్రబాబు చెప్పారు.






