నేటితరం విద్యార్థులు, యువత ఎక్కువగా ఐఫోన్‌లు వాడుతున్నారు. అయితే, ఆ ఫోన్‌లలో చాలామందికి తెలియని కొన్ని రహస్య ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు కాలేజీ విద్యార్థుల జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయి. సమయాన్ని ఆదా చేస్తాయి.
చాలామంది డాక్యుమెంట్‌లు స్కాన్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటారు. కానీ ఐఫోన్‌లో డాక్యుమెంట్ స్కానర్ యాప్ ముందే ఉంటుంది. దీని కోసం నోట్స్ యాప్‌ను వాడాలి. అందులో కెమెరా ఐకాన్ మీద నొక్కితే ‘డాక్యుమెంట్స్ స్కాన్’ ఆప్షన్ వస్తుంది. దీనితో అసైన్‌మెంట్‌లు, ఐడీ కార్డులు, క్లాస్ నోట్స్ లాంటివి త్వరగా స్కాన్ చేసుకోవచ్చు.
వైఫై పాస్‌వర్డ్ షేరింగ్
మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చినప్పుడు, వైఫై పాస్‌వర్డ్ అడిగితే చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది. టైప్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ నుంచి వైఫై పాస్‌వర్డ్ క్షణాల్లో షేర్ చేసుకోవచ్చు. దీని కోసం మీ ఫోన్లో బ్లూటూత్, వైఫై ఆన్ చేయండి. మీ ఫ్రెండ్ వైఫై ఆన్ చేసిన వెంటనే మీ ఫోన్లో ‘పాస్‌వర్డ్ షేర్’ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే వైఫై ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుంది.
బ్యాక్ ట్యాప్ షార్ట్‌కట్
ఐఫోన్ వెనకాల రెండు లేదా మూడు సార్లు నొక్కితే చాలు, కొన్ని పనులు త్వరగా చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్లి, యాక్సెసిబిలిటీలోకి వెళ్లండి. అందులో టచ్ ఆప్షన్ నొక్కితే బ్యాక్ ట్యాప్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలో స్క్రీన్‌షాట్ తీయడం, ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, లేదా ఏదైనా యాప్ ఓపెన్ చేయడం లాంటివి పెట్టుకోవచ్చు. ఇది క్లాసుల్లో లేదా రాత్రి చదువుకునేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది.
లైవ్ టెక్స్ట్
ఈ ఫీచర్ పుస్తకాలు లేదా బోర్డు మీద ఉన్న టెక్స్ట్‌ను ఫోటో తీస్తే, దాన్ని నేరుగా టెక్స్ట్‌గా మార్చేస్తుంది. కెమెరా ఆన్ చేసి, టెక్స్ట్ మీద పాయింట్ చేయండి. లైవ్ టెక్స్ట్ ఐకాన్ నొక్కితే టెక్స్ట్ కాపీ చేసుకోవచ్చు. దీనివల్ల క్లాసు నోట్స్ తీసుకోవడం సులభం అవుతుంది.
ఫోకస్ మోడ్
కాలేజీలో చదివేవారికి, ఇతరుల నుంచి వచ్చే నోటిఫికేషన్స్ పెద్ద తలనొప్పిగా ఉంటాయి. వాటిని ఆపడానికి ఫోకస్ మోడ్ చాలా ఉపయోగపడుతుంది. సెట్టింగ్స్లో ఫోకస్ మోడ్ ఆప్షన్ ఉంటుంది. దానిలో మీరు చదువుకునేటప్పుడు ఏ యాప్స్, ఎవరి నుంచి నోటిఫికేషన్లు రావద్దో ఎంచుకోవచ్చు. దీనివల్ల దృష్టి మరలకుండా, చదువుపై దృష్టి పెట్టవచ్చు.





