- ఇరాన్‌పై అమెరికా దాడులు అణు కార్యక్రమాన్ని నాశనం చేయలేదని నిఘా నివేదిక వెల్లడి.
- ఇది కేవలం కొన్ని నెలలు బ్రేక్ మాత్రమే.. ట్రంప్ చేసిన ప్రకటనలకు భిన్నంగా నివేదిక సారాంశం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు స్థావరాలపై చేసిన దాడులు పూర్తిగా విజయవంతమయ్యాయని, అణు కార్యక్రమం నాశనమైందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై తాజాగా లీకైన ఒక ప్రాథమిక అమెరికా నిఘా నివేదిక (ఇంటెలిజెన్స్ రిపోర్ట్) సంచలనం సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రకారం, ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేయలేదని, కేవలం కొన్ని నెలలు మాత్రమే వెనక్కి నెట్టాయని తేలింది.
నెలల్లోనే పునరుద్ధరణ?
డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, దాడులు జరిగినప్పటికీ ఇరాన్ అణు స్థావరాలు పెద్దగా దెబ్బతినలేదని, టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని కొన్ని నెలల్లోనే తిరిగి ప్రారంభించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా, దాడులకు ముందే ఇరాన్ తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియంలో (అణు ఆయుధాల తయారీకి వాడేది) చాలా భాగాన్ని రహస్య స్థావరాలకు తరలించిందని ఈ నివేదిక బయటపెట్టింది. అమెరికా మీడియా కూడా DIA నివేదికలోని ఈ అంశాలను ధృవీకరించింది. దాడులు అణు కేంద్రాల ప్రవేశ ద్వారాలను మూసివేశాయే తప్ప, భూగర్భ నిర్మాణాలను నాశనం చేయలేదని నివేదిక సూచిస్తుంది. గత వారం అమెరికా బి-2 బాంబర్లు ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్ అనే రెండు అణు స్థావరాలపై భారీ GBU-57 బంకర్-బస్టర్ బాంబులతో దాడి చేశాయి. మూడో స్థావరం ఇస్ఫాహాన్‌పై గైడెడ్ మిసైల్ జలాంతర్గామి టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ట్రంప్ ఈ దాడులను “అద్భుతమైన సైనిక విజయం”గా అభివర్ణించి, అణు స్థావరాలను “పూర్తిగా నాశనం” చేశామని ప్రకటించారు.
ట్రంప్, శ్వేతసౌధం స్పందన
ఈ నివేదిక లీక్ అయిన తర్వాత శ్వేతసౌధం స్పందించింది. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, నివేదిక “అత్యంత రహస్యమైనది” అయినప్పటికీ లీక్ అయిందని ధృవీకరించారు. ఇది “ధైర్యవంతులైన ఫైటర్ పైలట్లను తక్కువ చేయడానికి” చేసిన ప్రయత్నమని ఆరోపించారు. ” 30,000 పౌండ్ల బాంబులను ఖచ్చితంగా లక్ష్యాలపై వేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు: పూర్తిగా నాశనం అవుతుంది” అని ఆమె Xలో పోస్ట్ చేశారు. లీకైన నివేదిక వివరాలు వెలుగులోకి రాగానే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నిఘా నివేదికను ఖండించారు. అణు స్థావరాలు “పూర్తిగా నాశనమయ్యాయని” పునరుద్ఘాటించారు. కొన్ని మీడియా ఛానెల్‌లను లక్ష్యంగా చేసుకుని, చరిత్రలో అత్యంత విజయవంతమైన దాడులలో ఒకదాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ విరుచుకుపడ్డారు.





