- శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భీకర ఎదురుకాల్పులు.
- ‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్.
- ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతం; వీరు పహల్గాం దాడికి పాల్పడినవారేనని ప్రచారం.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని చినార్ కోర్ వెల్లడించింది. అయితే, వీరు ఇటీవలి పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులే అని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చినార్ కోర్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

‘ఆపరేషన్ మహదేవ్’తో ఉగ్రవాదుల ఏరివేత
‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నాయి. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో నెల రోజుల నుంచి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు సోమవారం ఉదయం దాచిగమ్ అటవీ ప్రాంతంలో గాలింపు చేపడుతుండగా, భద్రతా దళాల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనికి భద్రతా సిబ్బంది దీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు విదేశాలకు చెందిన వారని, లష్కరే తయిబాకు సంబంధించిన వారని సమాచారం. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టి కార్డన్‌సెర్చ్ చేపట్టారు. ఘటనాస్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే వారి వివరాలు తెలుస్తాయని భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఆపరేషన్‌ను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలోనే చేపట్టామని, మరణించిన ఉగ్రవాదులు ఆ దాడికి పాల్పడిన వారిగానే తెలుస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయాలపై సైన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పహల్గాం మారణహోమం, కొనసాగుతున్న ఉగ్రవేట
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. అతి సమీపం నుంచి కాల్పులు జరిపి 25 మంది పర్యాటకులు, ఒక కశ్మీరీ వ్యక్తి ప్రాణాలు తీశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. అప్పటినుంచి భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట సాగిస్తున్నాయి. లష్కరే తయిబాకు అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరిలో ఒక్కొక్కరి తలపై 20 లక్షల వరకు రివార్డును ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆట కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.





