జంక్ ఫుడ్, ఒత్తిడితో నిద్ర దూరం. వ్యాయామంతో నిద్రలేమికి చెక్.
నేటి తరం జీవనశైలిలో నిద్రలేమి ఒక ప్రధాన సమస్యగా మారింది. తీరిక లేని పనులు, రాత్రి విధులు, ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది నిద్రకు దూరమవుతున్నారు. నిద్రలేమి కారణంగా అధిక బరువు, బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి మూడో శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం జరుపుకుంటున్నారు.
చక్కెర, కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం, మసాలాలు ఎక్కువగా ఉండే జంక్, ఫాస్ట్ ఫుడ్ వంటివి నిద్రపై ప్రభావం చూపుతాయి. రాత్రిపూట విధులు నిర్వహించేవారు ఉదయం నిద్రపోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, గొడవలు వంటి కారణాల వల్ల చాలామంది ఒత్తిడి, ఆందోళనలకు గురవుతున్నారు. ఇది కూడా నిద్రలేమికి దారితీస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మానసిక ఒత్తిడితో బాధపడుతూ వైద్యుల వద్దకు వెళ్లే వారిలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. 90 శాతం అనారోగ్య సమస్యలకు నిద్రలేమి ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.
మానసిక సమస్యలతో బాధపడుతూ నిద్ర సరిగా రాక ఆసుపత్రికి వస్తున్న వారిలో 14 సంవత్సరాల వయస్సు వారు అధికంగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య వృద్ధుల్లో కూడా సాధారణంగా వస్తుంది. దీన్ని అధిగమించడానికి మంచి ఆహారం తీసుకోవాలని, వ్యాయామం చేయాలని, ఒత్తిడికి దూరంగా ఉండాలని, చిన్న విషయాలకు ఆందోళన చెందకూడదని వైద్యులు సూచిస్తున్నారు.





