- జగన్నాథ్ మూవీ టీజర్ లాంచ్‌లో సినీ హీరో మంచు మనోజ్
- కుటుంబ సమస్యలపై పరోక్ష వ్యాఖ్యలు – అభిమానులే తన అసలైన బలం అన్న మనోజ్
అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన ‘జగన్నాథ్’ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితం, కుటుంబ సమస్యలపై పరోక్షంగా స్పందించారు. “నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మంది తొక్కాలని చూసినా, బురద చల్లాలని చూసినా, ఏమీ చేయలేరు” అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. తాను న్యాయం కోసం పోరాడతానని, ఆ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. అభిమానులే తన దేవుళ్లు, వారే తన కుటుంబమని మనోజ్ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.
“న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను”
తన కుటుంబానికి సంబంధించి ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. “చెట్టు పేరు, జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోయే పండు కాదు, మీ మనోజ్‌ను” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. “నా మీద ఎవరైనా కుట్రలు పన్నినా, నన్ను ఆ నాలుగు గోడల మధ్య పెట్టినా, ప్రజల గుండెల్లోంచి నన్నెవరూ తీసేయలేరు” అని స్పష్టం చేశారు. అభిమానుల ఆశీస్సులు తనకు అండగా ఉంటాయని, వారి కోసం చివరి వరకు పోరాడతానని తెలిపారు. “బయటి వాళ్లైనా సరే, నా వాళ్లైనా సరే – తప్పు చేశారంటే ఒప్పుకోను. న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు” అని ఆయన గట్టిగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హీరో భరత్, ‘జబర్దస్త్’ టీమ్, మూవీ యూనిట్ తదితరులు పాల్గొన్నారు.





