- ప్రముఖ నటుడు మోహన్‌బాబు, మనోజ్ రంగా రెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు.
- తల్లిదండ్రుల సంరక్షణ చట్టం కింద రక్షణ కోరుతూ మోహన్‌బాబు లేఖ, మనోజ్‌పై అక్రమ ఆక్రమణ ఆరోపణలు.. కలెక్టర్ ఎదుట రెండున్నర గంటల విచారణ
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య నెలకొన్న ఆస్తి వివాదం మరోసారి అధికారిక వేదికపై చర్చకు వచ్చింది. రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని సమీకృత జిల్లా కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఈ వివాదంలో, తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని మోహన్‌బాబు జిల్లా అధికారులకు లేఖ రాశారు.
మనోజ్‌పై మోహన్‌బాబు ఫిర్యాదు
మోహన్‌బాబు నివాసముంటున్న బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామంలోని ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో గతంలో అదనపు కలెక్టర్ ఎదుట మనోజ్ హాజరై వివరణ ఇచ్చారు. అయితే, తాజాగా ఈ రోజు ఇద్దరూ కలెక్టర్ ఎదుట తమ వాదనలు వినిపించారు. దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ జరిగిన తర్వాత, మనోజ్ తన ఆస్తిని అప్పగించాలని మోహన్‌బాబు డిమాండ్ చేశారు. మరోసారి విచారణకు హాజరు కావాలని మేజిస్ట్రేట్ ఆదేశించినట్లు సమాచారం. అయితే, విచారణ అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.





