గుండె జబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే.. రకరకాల పరీక్షలు చేయించుకోవాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక AI స్టెతస్కోప్ ఆ పనిని కేవలం 15 సెకన్లలోనే చేసేస్తుంది. ఇది గుండె సంబంధిత మూడు ప్రధాన సమస్యలను వెంటనే గుర్తించగలదు. ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.
అమెరికాకు చెందిన ఎకో హెల్త్ అనే సంస్థ ఈ AI స్టెతస్కోప్‌ను తయారు చేసింది. ఇందులో సంప్రదాయ స్టెతస్కోప్ తో పాటు ఆధునిక కంప్యూటింగ్ పవర్ ను కలిపారు. 1816లో కనుగొన్న సాధారణ స్టెతస్కోప్ కు భిన్నంగా, ఈ కొత్త AI స్టెతస్కోప్ లో ఒక మైక్రోఫోన్ ఉంటుంది. ఇది మనిషి చెవికి వినిపించని గుండె శబ్దాలను, రక్త ప్రసరణ మార్పులను గుర్తించగలదు. అదే సమయంలో, ఒక ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) ను కూడా రికార్డు చేస్తుంది. ఈ సమాచారాన్ని క్లౌడ్‌లో అప్‌లోడ్ చేస్తారు. అక్కడ కొన్ని నిమిషాల్లోనే కొన్ని ప్రత్యేక అల్గారిథమ్‌లు దానిని విశ్లేషిస్తాయి. దీనితో గుండె పోటు, ఆర్టియల్ ఫిబ్రిలేషన్, గుండె కవాట వ్యాధి వంటి ప్రమాదాలు ఉన్నాయేమో చూస్తాయి. పరీక్ష ఫలితం వెంటనే స్మార్ట్‌ఫోన్‌కు వస్తుంది. దీని వల్ల డాక్టర్లు వెంటనే చికిత్స మొదలు పెట్టే అవకాశం ఉంటుంది.
పరీక్షల్లో మెరుగైన ఫలితాలు..
TRICORDER అనే అధ్యయనంలో భాగంగా లండన్‌లోని దాదాపు 200 జిపి సర్జరీలలో ఈ AI స్టెతస్కోప్‌ను పరీక్షించారు. శ్వాస ఆడకపోవడం, అలసట లాంటి లక్షణాలు ఉన్న 12,700 మంది రోగులను ఈ పరికరంతో పరీక్షించారు. ఫలితాలు చాలా బాగున్నాయి. ఈ పరికరాన్ని వాడిన రోగులలో గుండె పోటు 2.3 రెట్లు, ఆర్టియల్ ఫిబ్రిలేషన్ 3.5 రెట్లు, గుండె కవాట వ్యాధి దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలను ముందుగా గుర్తించడం వల్ల సరైన సమయంలో చికిత్స అందించవచ్చని డాక్టర్లు అంటున్నారు.
అన్ని ఆశించినంత సులభంగా జరగలేదు..
అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నా ఈ పరికరం వాడకం విషయంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఒక సంవత్సరం తర్వాత, దాదాపు 70 శాతం మంది డాక్టర్లు దీనిని వాడటం తగ్గించారు. దీనిని డాక్టర్ల పనిలో భాగం చేయాలంటే మరింత శిక్షణ అవసరం అని పరిశోధకులు అంటున్నారు. అలాగే, ఈ పరికరం గుండె పోటు ఉన్నట్లు చెప్పిన రోగులలో దాదాపు మూడింట రెండు వంతుల మందికి నిజంగా ఆ సమస్య లేదు. ఇది అనవసరమైన ఆందోళనను, పరీక్షలను పెంచినప్పటికీ, గుండె పోటు లాంటి సమస్యలను గుర్తించకుండా ఉండటం కంటే ఇది మంచిదని పరిశోధకులు వాదిస్తున్నారు.





