
చేపలను ఆకర్షించి వేటను సాగించేందుకు రెక్కలను పందిరిగా విప్పి నీడను సృష్టించే ప్రత్యేకతతో కొల్లేరు సరస్సులో దర్శనమిచ్చే బ్లాక్ హెరాన్ చూసేందుకు ఎంతో విశిష్టంగా ఉంటుంది. ఆఫ్రికన్ జాతికి చెందిన ఈ పక్షిని బ్లాక్ ఎగ్రెట్ అని కూడా పిలుస్తారు. నల్లటి ముక్కు, మెడ, రెక్కలు, తోకతో పాటు కాళ్ల చివరివరకు నలుపు రంగులో ఉండటంతో, దీనిని స్థానికులు నల్ల కొంగగా ఆప్యాయంగా పిలుస్తారు. సుమారు 42 నుంచి 66 సెం.మీ. పొడవు, 1.5 కేజీల బరువుతో ఉండే ఈ పక్షి చిన్న చేపలు, కీటకాలు, కప్పలను ఆహారంగా తీసుకుంటుంది.
మంచినీటి సరస్సులు, చిత్తడి నేలలు, నదులు, వరి పొలాల్లో అధికంగా కనిపించే ఈ పక్షి, శీతాకాలంలో ముదురు నీలం రంగు గుడ్లను పెట్టి, 24 రోజుల పాటు పొదిగి సంతానోత్పత్తి చేస్తుంది. మన దేశంతో పాటు ఆఫ్రికా, సుడాన్, దక్షిణాఫ్రికా, ఇటలీ, మడ్‌గాస్కర్ వంటి దేశాల్లో ఎక్కువగా నివసించే ఈ బ్లాక్ హెరాన్, కొల్లేరు సరస్సులో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొల్లేరులో ఈ పక్షుల సంఖ్య 200 లోపే ఉందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పర్యావరణానికి మేలు చేసే ఈ పక్షి ప్రత్యేకతలు అనేకం, ఈ సౌందర్యాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత.






