పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో బుకింగ్స్ మొదలయ్యాయి. రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. అక్కడి కలెక్షన్లు 800K డాలర్లకు పైగా చేరి, కొత్త రికార్డులు సృష్టించాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వసూళ్లు 1 మిలియన్ డాలర్ల మార్కును దాటుతాయని అంచనా వేస్తున్నారు.
ఒక్క టికెట్ రూ.5 లక్షలు!
సాధారణంగా పెద్ద హీరోల సినిమాల ఫస్ట్ షో టికెట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. కొన్ని చోట్ల వీటిని బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముతారు. కానీ ఈసారి ‘ఓజీ’ నైజాం ఫస్ట్ టికెట్‌ను ప్రత్యేకంగా వేలం వేశారు. ఈ వేలంపాటలో ఒక్క టికెట్ ధర ఏకంగా 5 లక్షల రూపాయలు పలికింది. ఈ టికెట్‌ను నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ సొంతం చేసుకుంది. ఈ 5 లక్షల మొత్తాన్ని జనసేన పార్టీ ఫండ్‌కు విరాళంగా ఇస్తామని, మూడు రోజుల్లో అందజేస్తామని వారు ప్రకటించారు. దీంతో #OGFirstTicketAuction ట్విట్టర్‌లో ట్రెండింగ్ అయింది. ఒక్క టికెట్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేశారని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే, ఆ మొత్తం పార్టీకి వెళ్తుండటం, అలాగే పవన్‌పై ఉన్న అభిమానంతోనే ఈ స్థాయిలో కొనుగోలు చేశారని ఫ్యాన్స్ చెబుతున్నారు.





