ఆండ్రాయిడ్ యూజర్లకు ప్లే స్టోర్ ఓ యాప్ భాండాగారమే అనొచ్చు. ఎందుకంటే అవసరానికి తగిన యాప్స్ లెక్కకు మిక్కిలి ఉంటాయ్. వెతికి ఎంచక్కా ఇన్ స్టాల్ చేసేస్తారు. అక్కర్లేని యాప్స్ ని క్షణాల్లో అన్ ఇన్ స్టాల్ చేసేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ లను ఎక్కువగా వాడడానికి ఓ ముఖ్యమైనా అడ్వాంటేజ్ యాప్స్ మాత్రమే అనొచ్చు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లు మరింత అనువుగా వాడుకునేలా ప్లే స్టోర్ లో సరికొత్త ఫీచర్స్ గూగుల్ సిద్ధం చేస్తోంది. వాటిల్లో ఒకటి ‘స్మార్ట్ రిజ్యూమ్’. ఇదేం చేస్తుందంటే.. మీ డేటా ఆదా చేస్తుంది. ఎందుకంటే చాలా మంది యూజర్లు లిమిటెడ్ డేటా ప్లాన్ తోనే ఫోన్ లో నెట్ వాడుతుంటారు. ఎప్పటికప్పుడు డేటాని ఆఫ్ చేస్తూ.. అవసరం ఉన్నప్పుడే ఆన్ లో ఉంచుతారు. అలాంటప్పుడు యాప్స్ ఇన్ స్టాల్ చేసే క్రమంలోనూ డేటా వృథా కాకుండా ‘స్మార్ట్ రిజ్యూమ్’ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
ఏదైనా అనుకోని కారణాలతో ఇన్ స్టాల్ చేస్తున్న యాప్స్ కొన్ని సార్లు స్ట్రక్ అవుతాయ్. మళ్లీ డేటా రీసెట్ అవ్వగానే అవి మొదట్నుంచి ఇన్ స్టాల్ అవుతాయ్. దీంతో డేటా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే, సమయం కూడా వృథా అవుతుంది. అందుకే ఇలా ఆగిన యాప్స్ ని స్మార్ట్ రిజ్యూమ్ తో మేనేజ్ చేయొచ్చు. ఆగిన చోటి నుంచే అవి తిరిగి ఇన్స్ స్టాల్ అయ్యేలా చేయొచ్చు. 24 గంటల్లోపే ఈ ప్రాసెస్ పూర్తవుతుంది. ఈ ఫీచర్ వాడుకోవాలంటే మాత్రం ఫోన్ లో కచ్చితంగా 5జీబీ స్పేస్ ని కేటాయించాలి. అయితే, ఇప్పటి వరకూ ఈ రకమైన ఫీచర్ ని యాపిల్ యూజర్లు ‘డౌన్ లోడ్స్ పాజ్/రిజ్యూమ్’ తో యాక్సెస్ చేస్తున్నారు. ఇకపై ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా ఈ రకమైన ఫీచర్ ని వాడుకోగలుగుతారు. అలాగే, గేమ్స్ కంట్రోల్ ని కూడా మరింత స్మార్ట్ గా మర్చేస్తూ ‘రిజ్యూమ్ ప్లేయింగ్’ ఫీచర్ ని పరిచయం చేయనుంది. దీంతో కూడా గేమ్ ని ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే ఇట్టే స్టార్ట్ చేయొచ్చు. ప్లే స్టోర్ ని గేమ్స్ ట్యాబ్ లో ఈ వెసులుబాటుని కల్పించనుంది. అంతేకాదు.. ప్లే స్టోర్ లోకి ‘ఏఐ’ని మిళతం చేస్తూ వినూత్నంగా మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టంది గూగుల్. దీంతో యూజర్లు ప్లే స్టోర్ ని మరింత సౌకర్యంగా వాడుకోవచ్చు.






