
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తూ పలు రికార్డులను తిరగరాస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, 11 రోజుల్లోనే రూ.1409 కోట్ల గ్రాస్ వసూలు చేసి మరో కీలక మైలురాయిని అందుకుంది. ఈ వసూళ్లతో ‘కేజీయఫ్ 2’ (రూ.1250 కోట్లు), ‘RRR’ (రూ.1387 కోట్లు) సినిమాలను దాటేసింది.
ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ‘పుష్ప 2’ మూడో స్థానంలో నిలిచింది. ‘దంగల్’ (రూ.2024 కోట్లు) జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, ‘బాహుబలి 2’ (రూ.1810 కోట్లు) రెండో స్థానంలో ఉంది. ‘పుష్ప 2’ అయితే మరింత వేగంగా టాప్ రికార్డుల వైపు పయనిస్తోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ సైతం మంచి స్పందనతో రూ.561 కోట్లకు పైగా వసూళ్లు సాధించి డబ్బింగ్ సినిమాల కొత్త రికార్డు నెలకొల్పింది.
ఇక విదేశాల్లో కూడా ‘పుష్ప 2’ దూసుకుపోతోంది. యూకేలో రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అమెరికాలో కూడా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా విజయం వెనుక అల్లు అర్జున్ ఎనర్జీతో కూడిన నటన, రష్మిక మందన్నా పాత్ర, సముద్రఖని, ఫహద్ ఫాజిల్ వంటి నటుల ఆకట్టుకునే ప్రదర్శనలు ప్రధాన కారణం.
2021లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ‘పుష్ప 2’ అంచనాలకు మించి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సినిమా టీమ్ త్వరలోనే 3డీ వెర్షన్‌ను దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనుంది. విడుదల తర్వాత కూడా సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల వసూళ్ల జోరు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.






