సినీ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన సేవా కార్యక్రమాలతో మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు. శారీరక వికలాంగురాలైన స్వేత అనే అమ్మాయికి ఇల్లు నిర్మించి, బహుమతిగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లారెన్స్ దివ్యాంగులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. గతంలో స్వేతకు కాళ్ళకు సపోర్ట్ బ్రేస్‌లు అందించారు. ఆ తర్వాత ఆమె స్వతంత్రంగా తిరగడానికి స్కూటీ కూడా బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు ఆమె జీవితం మరింత మెరుగుపడాలని భావించి ఇల్లు నిర్మించి ఇచ్చారు.
తాజాగా వైరల్ వీడియోలో లారెన్స్ సంప్రదాయ వేషధారణలో ఉన్నారు. అమ్మాయి చేతిని పట్టుకుని నడుస్తూ, ఇంటిలోకి తీసుకెళ్లారు. ఇంటి ముందు మామిడి తోరణాలు, పూల డెకరేషన్‌తో పండుగ వాతావరణం కనిపించింది. ఈ సందర్భంగా లారెన్స్ తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ‘‘హాయ్ అందరూ, ఇది స్వేత. ముందు ఆమెకు వాకింగ్ సపోర్ట్ ఇచ్చాను. తర్వాత స్కూటీ గిఫ్ట్ చేశాను. ఇప్పుడు ఇల్లు నిర్మించడం ఆమె జీవితాన్ని మారుస్తుందని భావిస్తున్నాను. ఆమె గోల్డెన్ హార్ట్ ఉన్న బాలిక. నా హార్ట్ ఫుల్ తనకే!!’ అని రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో ప్రశంసలు
పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల మంది ఈ వీడియోను చూశారు. వేల మంది లైక్ చేసి, రీపోస్ట్ చేశారు. ‘‘మంచి హార్ట్ లారెన్స్ అన్నా’’, ‘‘సేవే దేవుడు’’ అంటూ అభిమానులు, నెటిజన్లు రాఘవ లారెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలని కోరుతూ ఈ వీడియో ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.





