- దర్శకుడిగా మారనున్న టాలీవుడ్ కమెడియన్ రాహుల్
- తొలి చిత్రానికి నటీమణుల ఎంపిక ప్రారంభం
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో దర్శకుడిగా మారనున్నారు. తొలి సినిమాను తానే డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. “దర్శకుడిగా నా తొలి సినిమా ఇది. ఆసక్తి ఉన్నవారు మీ ఫొటోలు, షోరిల్స్ నా మెయిల్‌కి పంపించండి” అంటూ శనివారం ఉదయం ఓ పోస్ట్ పెట్టారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించిన రాహుల్ ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ సినిమాకు డైలాగ్ రైటర్‌గా కూడా పనిచేశారు. 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘భరత్ అనే నేను’, ‘చి.ల.సౌ.’, ‘గీత గోవిందం’, ‘కల్కి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘జాతిరత్నాలు’, ‘ఓం భీమ్ భుష్’ వంటి సినిమాల్లో నటించారు. హాస్యభరితమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మారనున్నారు. నటనతోపాటు కథా, దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.





