
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పరిస్థితి తీవ్రమవుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి బ్యారేజ్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. తిరుపతి, తిరుమలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో ఫెయింజల్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే అపార నష్టం జరిగిన నేపథ్యంలో, ఈ తాజా వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
తమిళనాడులోనూ పరిస్థితి దాదాపు ఇదే. చెన్నైతో సహా 17 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.





