దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం అంటూ ఏమీ ఉండవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కేవలం దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే, రక్షణ రంగంలో దేశం స్వావలంబన సాధించడం అత్యవసరమని పేర్కొన్నారు.
ఒక జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్, ప్రపంచం వేగంగా మారుతోందని, కొత్త సవాళ్లు పుట్టుకొస్తున్నాయని అన్నారు. “మహమ్మారులు, ఉగ్రవాదం, ప్రాంతీయ ఘర్షణలు వంటి వాటితో ఈ శతాబ్దం అత్యంత సవాలుతో కూడింది. మన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఆత్మనిర్భరత అత్యవశ్యకం” అని ఆయన అన్నారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిస్థితుల కారణంగా రక్షణ పరంగా విదేశాలపై ఆధారపడటం సరైనది కాదని స్పష్టమవుతోందని చెప్పారు.
రక్షణ రంగంలో భారత్ పురోగతి
భారత రైతులు, వ్యాపారవేత్తల ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2014లో మన రక్షణ రంగం ఎగుమతుల విలువ కేవలం రూ.700 కోట్లు కాగా, ఇప్పుడు అది రూ.24 వేల కోట్లకు చేరిందని వివరించారు. ఈ గణాంకాలు చూస్తుంటే, భారత్ కేవలం కొనుగోలుదారుగానే కాకుండా, ఎగుమతిదారుగా కూడా మారుతోందని అర్థమవుతోందని పేర్కొన్నారు. “మన బలగాలు స్వదేశీ పరికరాలతో లక్ష్యాలపై కచ్చితత్వంతో చేసిన దాడులు, మన దూరదృష్టికి, సమన్వయానికి నిదర్శనం” అని ఆయన అన్నారు.
ట్రంప్ సుంకాలు, మోదీ చైనా పర్యటన
భారత్‌ను మిత్రదేశం అంటూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించారు. గతంలో విధించిన 25% సుంకానికి అదనంగా మరో 25% సుంకాలు విధించారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఇది చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్యనే, ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.





