- మహిళలకు అతి త్వరగా సహాయం అందించేందుకు 112 నంబర్‌కు కాల్ చేయాలని సూచన
- గంజాయి రవాణాపై కఠిన చర్యలు, రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సోమవారం మహిళా అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీం పై వివరాలు వెల్లడించారు. లైంగిక వేధింపులు, హింస ఎదురైనప్పుడు 112 నంబర్‌కు ఫోన్ చేస్తే శక్తి బృందం 15 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుకుంటుందని తెలిపారు. గంజాయి రవాణా నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి అన్నారు. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి 39 చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు అమర్చామని తెలిపారు. గత ఆరు నెలల్లో 8 వేల కేజీల గంజాయి పట్టుకుని, 490 మందిని అరెస్టు చేశామని, 109 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటివరకు 40 వేల కెమెరాలు అమర్చామని చెప్పారు.





