పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకునే ముందు ఇకపై కొంచెం ఆలోచించాలి. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారు మరింత జాగ్రత్తగా ఉండాలని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. బ్రిటన్‌కు చెందిన నాటింగ్‌హామ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో పారాసిటమాల్ వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు తేలింది. సాధారణంగా జ్వరం తగ్గించేందుకు, కీళ్ల నొప్పులకి పారాసిటమాల్‌ను సురక్షితమని భావిస్తారు. కానీ దీర్ఘకాలం వాడితే ఇది జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావం (24%) మరియు పేగుల్లో రక్తస్రావం (36%) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని గుర్తించారు. అంతేకాకుండా కిడ్నీ జబ్బు (19%), గుండె వైఫల్యం (9%), అధిక రక్తపోటు (7%) వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
పరిశోధకులు ముఖ్యంగా వృద్ధుల్లో దీర్ఘకాలం పారాసిటమాల్ వాడకంపై స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నారు. చిన్న నొప్పులైనా పారాసిటమాల్ వాడకం తక్కువగా ఉండేలా చూసుకోవడం, వైద్యుల సూచనలతోనే దీన్ని తీసుకోవడం మంచిదని తెలిపారు. వయసు పెరుగుతున్న కొద్దీ పారాసిటమాల్ వల్ల అనుకోని దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉంటాయని, కీళ్లనొప్పుల వంటి సమస్యలకు దీన్ని వాడటంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.






