- 65% మంది తల్లులు, 70% మంది తండ్రులు ఒక బిడ్డకు ప్రాధాన్యత ఇస్తారు
- కూతుళ్లు, చిన్న పిల్లలకే ఎక్కువ శాతం తల్లిదండ్రుల మద్దతు
- ఆలోచనా దృక్పథం కలిసే పిల్లల పట్ల తల్లిదండ్రులకు మక్కువ ఎక్కువ
- చిన్ననాటి వివక్ష 60 ఏళ్ల వయసులోనూ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది
ఒకే ఇంట్లో పెరిగిన ఇద్దరు పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఒకేలా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ, ఒకరు పాలు వలకబోస్తే ‘జాగ్రత్త’ అని చెప్పే తల్లిదండ్రులు, అదే పని ఇంకొకరు చేస్తే ‘పెద్ద లెక్చర్’ ఇస్తుంటారు. ఈ చిన్న వ్యత్యాసమే పిల్లల మనసులో లోతైన గాయాలు చేస్తుంది. అసలు తల్లిదండ్రులు ఒకరికే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? దానివల్ల కలిగే పర్యవసానాలేంటో కచ్చితంగా తెలుసుకోవాలి. (Signs of Parental Favoritism and its Long Term Effects)
పరిశోధనల ప్రకారం, మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఒకరి పట్ల ప్రత్యేక అభిమానాన్ని కలిగి ఉంటారు. పర్డ్యూ యూనివర్శిటీ ప్రొఫెసర్ జె. జిల్ సూటర్ చేసిన సుదీర్ఘ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడింట రెండొంతుల మంది తల్లిదండ్రులు ఒక బిడ్డకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ఆ ప్రాధాన్యత దశాబ్దాల పాటు మారదని ఈ సర్వే తేల్చింది. సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా కూతుళ్ల పట్ల తలిదండ్రులకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అలాగే తమ ఆలోచనలు, విలువలు (రాజకీయాలు లేదా మతం వంటివి) కలిసే పిల్లలతో వారు ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ కలిగి ఉంటారు.

“తల్లిదండ్రులు తాము సమానంగానే చూస్తున్నామని అనుకోవచ్చు. కానీ పిల్లల దృష్టిలో మాత్రం ఆ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫీలింగ్ వారి చదువు, కెరీర్ మరియు మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.”
పెద్దయ్యాక కూడా మర్చిపోరు!
ఈ వివక్ష కేవలం చిన్నప్పటికే పరిమితం కాదు. 60 ఏళ్ల వయసులో ఉన్న వారిని విచారించినప్పుడు కూడా, తమ తల్లిదండ్రులు ఎవరిని ఎక్కువగా ప్రేమించారో వారు స్పష్టంగా గుర్తుపెట్టుకున్నారని అధ్యయనం చెబుతోంది. తక్కువ ప్రాధాన్యత పొందిన పిల్లల్లో ఆందోళన (Anxiety), డిప్రెషన్ మరియు ఆత్మన్యూనతా భావం ఎక్కువగా కనిపిస్తాయి. అదే సమయంలో, అతిగా ప్రేమించబడిన బిడ్డ (Favorite Child) కూడా ఒక రకమైన అపరాధ భావం లేదా ‘తల్లిదండ్రుల అంచనాలను అందుకోవాలి’ అనే ఒత్తిడికి గురవుతుంటారు. విచిత్రమేమిటంటే, ఒక బిడ్డ జైలుకు వెళ్లినా లేదా జీవితంలో ఫెయిల్ అయినా.. ఆ బిడ్డపై ఉండే అభిమానం తగ్గదని, ‘వాడు మంచోడే, పరిస్థితులు బాలేవు’ అని తల్లులు సమర్థిస్తారని పరిశోధనలో తేలింది.
మొత్తానికి, తల్లిదండ్రుల పెంపకంలో ఉండే ఈ చిన్నపాటి తేడాలు పిల్లల జీవితాంతం నీడలా వెంటాడుతూనే ఉంటాయి. అందుకే పిల్లల మధ్య సాధ్యమైనంత వరకు పారదర్శకంగా ఉండటం, వారి మనోభావాలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
మీ ఇంట్లో కూడా ఇలాంటి ‘ఫేవరెటిజం’ ఎప్పుడైనా గమనించారా? ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.





