- డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ను ఓడించి దక్షిణాఫ్రికా టైటిల్ గెలిచింది
- ప్రపంచం అంతా ‘ఈ జట్టే గెలవాలి’ అనుకున్నది… అదే జరిగిపోయింది
డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలవడం చాలా మందికి ఊహల లోపలే ఉండదు. కంగారూలు వరుసగా రెండోసారి టైటిల్ గెలుస్తారనుకొని అంతా రెడీ అయిపోయారు. కానీ లార్డ్స్‌లో శనివారం ఆ సీన్లు తలకిందులయ్యాయి. కామిన్స్ సేన చేతులెత్తేస్తే, బవుమా అండ్ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ విజయం ఒక్క దక్షిణాఫ్రికాకే కాదు, మొత్తానికి క్రికెట్ అభిమానులందరికీ గర్వకారణం అయింది. ఎందుకంటే, “చోకర్స్” అనిపించుకున్న జట్టు… ఎన్నో ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టైటిల్ గెలిచి చూపించింది.
మార్‌క్రమ్, రబాడా బలమైతే.. అదృష్టం కూడా తోడైంది
పెద్ద మ్యాచ్లొ తడబడతాడన్న పేరు ఉన్న మార్‌క్రమ్ ఈసారి అసలు ఆ పేరు మిగలకుండా ఆడేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో స్టేడియంలో ఎవర్నీ చూసుకోకుండా బౌలర్లను బాదేశాడు. జట్టు విజయం వచ్చేదాకా క్రీజ్ వదలకుండా నిలిచిపోయాడు. ఇక రబాడా గురించి చెప్పాలంటే… ఇటీవలే నిషేధం నుంచి వచ్చాడు. అయినా బంతితో ఆస్ట్రేలియాను ఊపిరాడనివ్వలేదు. ముఖ్యమైన సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్‌ను సఫారీల దిశగా తిప్పేశాడు. మధ్యలో బవుమా క్యాచ్‌ను స్మిత్ వదలడం కూడా మ్యాచులో ఓ మలుపే అయింది.





