- క్రూ-10 మిషన్‌లో నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 ప్రయోగం విజయవంతం
- తొమ్మిది నెలలుగా ISSలో ఉన్న సునీతా, విల్మోర్ తిరిగి భూమికి రానున్న అవకాశం
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమికి తిరిగి రానున్నారు. గత తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉండిపోయిన ఆమె, బచ్ విల్మోర్తో కలిసి త్వరలోనే భూమికి తిరిగి రానున్నారు. నాసా-స్పేస్‌ఎక్స్ సంస్థలు ఈ రెండో ప్రయత్నంగా క్రూ-10 మిషన్ను విజయవంతంగా ప్రారంభించాయి. శనివారం (భారత కాలమానం ప్రకారం ఉదయం 4:33 గంటలకు) కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు ఉన్నారు. వీరు ISSలో చేరిన తర్వాతే సునీతా, విల్మోర్ భూమికి తిరిగొచ్చే వీలు ఉంటుంది.
ఎందుకు ఆలస్యం?
2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక ద్వారా సునీతా, విల్మోర్ ISSకు వెళ్లారు. వారం రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మిషన్ పూర్తిగా విఫలమైంది. ఆ తర్వాతా పలు అవాంతరాల కారణంగా సునీతా ఇప్పటివరకు ISSలోనే ఉండిపోయారు. ఇప్పుడు క్రూ-10 మిషన్ ద్వారా ISSకు నలుగురు కొత్త వ్యోమగాములు చేరుకోగానే, సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ భూమికి తిరిగి బయల్దేరనున్నారు.





