ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసి, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. సాక్షి ఛానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గుంటూరు తుళ్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే, ఈ అరెస్ట్ అక్రమమని పిటిషన్ దాఖలు కాగా, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. 70 ఏళ్ల సీనియర్ సిటిజన్‌ను, నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదని కోర్టు మండిపడింది.
టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా?
కొమ్మినేని అరెస్ట్‌పై పిటిషన్‌లో, మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు సెక్షన్ 41 కింద నోటీసు ఇవ్వాలని, పోలీసులు దాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. గెస్ట్ వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా బాధ్యుల్ని చేస్తారని, కొమ్మినేని వాటిని సమర్థించలేదని వాదించారు. తెలంగాణలో అరెస్ట్ చేసి, 331 కిలోమీటర్ల దూరంలో ఏపీలో రిమాండ్ చేయడం, ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ వాదనలు వినిపించారు. వాక్ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మీడియా హక్కులకు భంగం కలిగిందని, ఆర్టికల్ 19, 21, 22(1) ఉల్లంఘన జరిగిందని తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు, డిబేట్ నిర్వాహకుడిని అరెస్ట్ చేయడం తగదని, వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలని తీర్పిచ్చింది.





