- తిరుమలలో దర్శనం, వసతి, సేవల కోసం గూగుల్ ఏఐ వినియోగానికి తితిదే సిద్ధం
- రద్దీ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణ, భక్తులకు సమాచారం అందించడంలో సాంకేతికత ప్రయోగం
భక్తులకు వేగంగా, విఘ్నంలేకుండా శ్రీవారి దర్శనం కల్పించేందుకు తితిదే గూగుల్‌తో ఒప్పందానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు కృత్రిమ మేధ(ఏఐ) సేవలను ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం లోగా తితిదే-గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదరనుంది. తిరుమలలో భక్తుల రద్దీని అంచనా వేసి, దర్శనం, గదుల కేటాయింపును సమర్థంగా నిర్వహించేందుకు ఏఐ సహాయపడనుంది.
గూగుల్ మ్యాప్‌ల ద్వారా భక్తులు తితిదే కేంద్రాల్లోని రద్దీని ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. క్యూ లైన్ల నియంత్రణ, రద్దీ సమయాల్లో భక్తుల ఇబ్బందులు తక్కువగా ఉండేలా ఏఐ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. అదనంగా, భద్రత మెరుగుపరిచేందుకు ఏఐ కెమెరాలతో అనుమానితులను గుర్తించి, దళారులను అడ్డుకునే చర్యలు చేపడతారు. భవిష్యత్తులో ప్రతి భక్తుడికి ప్రత్యేక ఐడీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.





