- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభోత్సవం
- రోజుకు 35 వేల గారెలు – భవిష్యత్తులో పెంపు
తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెలు వడ్డించేందుకు టీటీడీ కొత్త ప్రక్రియను ప్రారంభించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. “అన్నప్రసాద మెనూలో మరొకటి అదనంగా చేర్చాలి” అనే ఆలోచనతో సీఎం చంద్రబాబుకు ఈ ప్రతిపాదనను సమర్పించగా, ఆయన ఆమోదించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు రోజుకు 35 వేల గారెలు వడ్డిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను పెంచి మరింత మందికి అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా స్వామివారి చిత్రపటాల ముందు గారెలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్, ఈవోలు స్వయంగా భక్తులకు గారెలు వడ్డించారు. భక్తులు “గారెలు చాలా రుచిగా, కమ్మగా ఉన్నాయి” అని సంతోషం వ్యక్తం చేశారు. జనవరి 20న ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఈరోజు నుంచి పద్ధతిగా అమలు చేయడం ప్రారంభించామని బీఆర్ నాయుడు తెలిపారు.





