- కస్టడీలో నలుగురు నిందితుల విచారణ.. ట్రిప్ సీట్లు, వే బిల్లుల్లో తేడాలపై ప్రశ్నలు
- వైష్ణవి డెయిరీతో బోలేబాబా డెయిరీ ఒప్పందం ఎలా కుదిరిందనే దానిపై దర్యాప్తు
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యి కల్తీ వ్యవహారం లో సిట్ విచారణ మూడో రోజు కొనసాగింది. సిట్ అధికారులు ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్, బోలేబాబా డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావడా లను తిరుపతిలో విచారించారు. రెండు రోజులుగా దాటవేసిన ప్రశ్నలను మరోసారి అడిగి, ఏ డెయిరీల నుంచి కల్తీ నెయ్యి సరఫరా అయిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 2019లో బోలేబాబా డెయిరీ టెండర్ రద్దు అయిన తర్వాత, విపిన్ జైన్, పొమిల్ జైన్ పెనుబాకలోని వైష్ణవి డెయిరీ డైరెక్టర్లుగా చేరి, టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కొత్త ప్లాన్ వేసినట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఏఆర్ డెయిరీ సామర్థ్యం లేకపోయినా టెండర్ ఎలా దక్కింది? దానికి ఏ స్థాయి వ్యక్తుల మద్దతు ఉంది? అనే కోణంలో సిట్ విచారణ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌లోని బోలేబాబా డెయిరీలో సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. నెయ్యి ట్యాంకర్ల తరలింపు, ట్రిప్ సీట్లు, వే బిల్లుల మధ్య తేడాలు బయటపడటంతో కీలక వ్యక్తులపై మరింత ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న తొమ్మిది మంది నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.





