- రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ‘వేంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణనిధి’ ఏర్పాటు.
- తిరుమల పవిత్రతకు భంగం కలిగించే అన్ని అనుమతులు రద్దు.
తిరుమల పవిత్రతను కాపాడే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిరోధించాలని, ఈ నేపథ్యంలో ఒబెరాయ్ హోటల్‌కు ఇచ్చిన 20 ఎకరాల అనుమతిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్టు నిధులతో పాటు భక్తుల విరాళాలను వినియోగిస్తామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతామని వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయిలో హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. తిరుమలలో హిందువులే ఉద్యోగాల్లో కొనసాగాలని, ఇతర మతస్తులకు ఆ బాధ్యతలు అప్పగించకూడదని స్పష్టం చేశారు. ఆలయాల నిర్వహణలో అవకతవకలు ఎదురైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఐదేళ్లలో ఆలయ పాలనలో జరిగిన అరాచకాలను విశ్లేషించి, విజయవంతమైన పాలనకు చర్యలు చేపడతామని ప్రకటించారు.





