- బ్రిక్స్ వైఖరికి మద్దతు ఇస్తే 10% అదనపు టారిఫ్
- ఎటువంటి మినహాయింపులు లేవని ట్రంప్ స్పష్టం
బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ‘‘బ్రిక్స్ దేశాల ‘అంటీ-అమెరికన్’ విధానాలకు మద్దతు ఇస్తే, ఆ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్ విధిస్తాం. ఎటువంటి మినహాయింపులు ఉండవు’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ ప్రకటన చేశారు. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో, అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను ఖండిస్తూ సభ్యదేశాలు రియో డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, వాణిజ్యానికి నష్టం కలిగిస్తాయని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. అయితే, అమెరికా పేరు నేరుగా ప్రస్తావించలేదు. ఇక భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. కొన్ని కీలక రంగాల్లో భారత్ స్పష్టమైన ఆంక్షలు విధించింది. ట్రంప్ తాజా హెచ్చరికల నేపథ్యంలో, వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.





