క్యాంపస్ బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై అమెరికా ఇమ్మిగ్రేషన్ నిఘా. పట్టుబడితే వీసా రద్దు, స్వదేశానికి పంపే ప్రమాదం.
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ అధికారులు కొత్త కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. క్యాంపస్ బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయకుండా నిఘా పెడుతూ, అక్రమంగా పని చేస్తే వీసా రద్దు చేసి వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు మానేస్తున్నారు. ఈ మార్పుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోంది.
అమెరికా నిబంధనలు
అమెరికా నిబంధనల ప్రకారం, ఎఫ్-1 వీసాపై ఉన్న విద్యార్థులు తమ యూనివర్శిటీ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ క్యాంపస్ వెలుపల పని చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే క్యాంపస్‌లో ఉద్యోగాల కొరత కారణంగా, భారతీయ విద్యార్థులు ఎక్కువగా సూపర్‌మార్కెట్లు, హోటళ్లు, పెట్రోల్ బంకుల్లో పని చేస్తున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులపై తనిఖీలు కఠినతరం చేయడంతో, విద్యార్థులు ఉద్యోగాలు వదులుకుంటున్నారు. కొన్ని నెలల పాటు అమెరికా ప్రభుత్వం ఈ కఠిన నియమాలను అమలు చేయవచ్చని, అయితే వ్యాపారాలకు నష్టమేనని వ్యాపారవేత్తలు చెబుతున్నారు. అక్రమంగా పనిచేసే విద్యార్థులను తొలగిస్తే హోటళ్లు, రెస్టారెంట్లు నష్టపోతాయని, ఏప్రిల్ తర్వాత పరిస్థితి మెరుగుపడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






